World environment Day: ప్రకృతి అనగా మనం కళ్ళతో చూసి, మనసుతో పలకరించి, మనసును పులకింపచేసేది మరియు శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం.
ప్రకృతికి మూలం పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం.
సృష్టికి కారణమైన, శాశ్వతమైన ప్రకృతి హిందూ మతంలోని సంఖ్యా దర్శనంలో చర్చించబడిన ఒక అంశం.
ఈ విశ్వంలో ఎన్నో జీవులు, ఎన్నో వస్తువులు ఉన్నాయి. దేని అందం దానికె గొప్ప, ప్రత్యేకం కూడా.
సృష్టికి అందాన్ని ఇచ్చేది ప్రకృతి. ప్రకృతి అందాలు వర్ణింప లేనంత గొప్పగా ఉంటాయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆహ్లాదకరమైన ప్రకృతి ని చూడగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. మన చుట్టూ ఉండే పొలాలు, పచ్చని చెట్లు, జలపాతాలు, నిర్మలమైన ఆకాశం, కొండలు, లోయలు… అందమైన, అద్భుత దృశ్యాలు ప్రకృతిలోని బాగాలే. వీటన్నింటిని చూస్తుంటే మనసులో చిన్న సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది.
భగవద్గీతలో “ప్రాథమిక స్వయంచాలిత శక్తి” గా ప్రకృతి వర్ణించబడింది. సృష్టి చర్యలలో ప్రకృతి యొక్క పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది.
పర్యావరణ పరిరక్షణ ఎంతో విలువైనది :
కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడపడానికి మరియు ప్రకృతిలోని అందాలను తిలకించడానికి పర్యావరణ యాత్రకు వెళుతున్నాము. ప్రకృతి అందవిహీనంగా ఉంటే మనం వాటిని చూడలేము, సరదాగా గడపలేము కూడా.
కావున ప్రతి ఒక్కరికి అందమైన ప్రకృతిని అందించడం అందరి బాధ్యత.
ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం దగ్గరకు వస్తుందనగానే హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు చట్టాలు ముఖ్యమైతే వాటిని పరిరక్షించడానికి చట్టాలు మాత్రమే సరిపోదు. మన జీవితంలో ప్రకృతికి ఎంత ముఖ్యమైన పాత్ర ఉందొ అలాగే మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణలో ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రాచీన సంస్కృతిలన్ని ప్రకృతిని అనగా చెట్లు, నదులు, పర్వతాలు.. వీటన్నింటిని ఆరాధిస్తూనే పెరిగాయి. మన దేశంలో ఒక చెట్టును నరికే ముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. నదులను తల్లులుగా భూమిని దేవతగా కొలిచిన దేశం మనది.
మనిషి తన జీవితకాలం మొత్తంలో తెలుసుకోగలిగే అనుభవాలలో తనకు, తన చుట్టూ ఉన్న పర్యావరణానికి గల సంబంధం మొట్టమొదటిదని ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతున్నది. మానవుల మనస్తత్వానికి ప్రకృతితో గాఢమైన, చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది.
మనిషి ఎంత ఎత్తు పెరిగిన దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నిప్పు, నేల, నింగి అనే పంచ భూతాల వలనే మానవ మనుగడ సాధ్యం అవుతుంది.
ఎప్పుడైతే మానవుడు ప్రకృతితో ఉన్న తన అనుబంధం నుంచి దూరంగా వెళ్ళడం మొదలు పెట్టాడో అప్పుడే కాలుష్యాన్ని పుట్టడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలైంది.
ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఇప్పటికి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతిని ఎంతో పవిత్రంగా భావించి, ఆరాధించే, గౌరవించి సాంప్రదాయాలని ప్రారంభించాల్సి ఉంది.
మనిషికి ప్రకృతి తో గల అనుబంధాన్ని మళ్లీ చిగురింప చేయడమే పర్యావరణ పరిరక్షణకు తొలిమెట్టు.
పర్యావరణ కాలుష్యానికి గల కారణాలు :
తన జీవితకాలంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని, తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించాలనే మనిషిలోని దురాశే పర్యావరణ కాలుష్యానికి మూల కారణం. భౌతికంగా కాలుష్యాన్ని సృష్టించడమే కాక వ్యతిరేక భావాలను సృష్టించడం ద్వారా కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.
ప్రకృతి ఉంది కేవలం మన అవసరాలు తీర్చడానికి మాత్రమే అని భావిస్తారు కానీ భూమిపై అన్ని వనరులు సక్రమంగా ఉన్నప్పుడే మానవ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. అంతేలేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్యానికి వేదికగా మారిపోతుంది.
పరిశ్రమలు వాహనాలు తదితరాల నుంచి వెలువడుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నందు వలనే జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

అకాల వర్షాలు విపరీతమైన వేడి వలన గ్లోబల్ వార్మింగ్ తో ఓజోన్ పొర దెబ్బతింటుంది.
అత్యధికమైన ఇందనాల వాడకం కూడా కాలుష్యానికి కారణం.
ప్లాస్టిక్ వాడకం అధికంగా పెరగడం కూడా పర్యావరణ పరిరక్షణ దెబ్బతీస్తుంది.
పట్టణాల విస్తీర్ణం పెరగడంతో వృక్షాలను విచక్షణరహితంగా నరికి వేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జంతువులకు ఆహారం దొరకక జనాల్లోకి వస్తున్నాయి.
కాలుష్య నివారణ పద్ధతులు :
రోజురోజుకు భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం,కొన్ని రకాల జీవరాశులు నశించి పోవడం పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. మనం చేసే పనుల వలనే కాలుష్యం పెరుగుతుంది కాబట్టి దానిని నివారించడం కూడా మన చేతుల్లోనే ఉంది.
మనం నివసించే ప్రదేశాలలో చెట్టు చెట్లు నాటాలి.

చెత్తను ఎక్కడపడితే అక్కడ కాకుండా రోడ్డు ప్రక్కన పెట్టి నా చెత్త కుండీలలో మాత్రమే వేయాలి.
ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.
ఇంధన వాడకం కూడా తగ్గించాలి. మనం వెళ్లే గమ్యం దగ్గర అయితే నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యానికి మంచిది మరియు కాలుష్యం కూడా తగ్గుతుంది.
మనం పీల్చే గాలి (ఆక్సిజన్) చెట్ల నుండి వస్తుంది కాబట్టి చెట్లను నరికి వేయాలనే ఆలోచన మానాలి.
మన అవసరాల కోసం మనం చేస్తున్న పనుల వల్ల కాలుష్యం ఎంతో పెరుగుతుంది. ఫలితంగా దీని వల్ల రోజుకు కొన్ని వందల జీవరాశులు అంతరించిపోతున్నాయి.
కుటుంబం కోసం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మన అవసరం, బాధ్యత అయితే దేశం కోసం మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా మన బాధ్యతే.

