వరంగల్ : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందాం: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
నూతన సంవత్సర వేడుకలను ఆనందభరితంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆయన ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్, షీ టీమ్స్ మరియు పెట్రోలింగ్ విభాగాల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు బలపరుస్తున్నట్లు తెలిపారు. వేడుకలు రాత్రి 12.30 గంటలకు ముగించాలని సూచిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
వేడుకల ప్రాంగణంలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఏర్పాటు చేయడం, అశ్లీల నృత్యాలు నిషేధించడం సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కఠినంగా అమలు చేస్తామని, అలాంటి వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. వేగంగా వాహనాలు నడపడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు కూడా చట్టపరమైన శిక్షలు విధించబడతాయని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలు రాకుండా పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతామని చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులను కలిగించే విధంగా వేడుకలు నిర్వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎవరు నియమాలు ఉల్లంఘించినా ప్రజలు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రజలు తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరంగా, ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.