వరంగల్ నగర ప్రజలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు గొప్ప ఊపిరి పోసిన వార్త వచ్చింది.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న CGHS వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విజయం వెనుక వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఏడాదిన్నర కాలంగా చేసిన నిరంతర కృషి, సంప్రదింపులు కీలక పాత్ర పోషించాయి.
వరంగల్‌లోని ఆకాశవాణి క్వార్టర్స్‌లో ఈ కొత్త వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కానుంది. డాక్టర్ కావ్య స్వయంగా నాలుగు అనువైన ప్రభుత్వ భవనాలను పరిశీలించి, అధికారులతో చర్చలు జరిపారు.
చివరికి ఆకాశవాణి పరిధిలోని సిబ్బంది క్వార్టర్స్‌ను ఎంచుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో నిరంతర సంప్రదింపుల ద్వారా ఈ అనుమతి సాధించారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా సుమారు 22 కేంద్రాలకు వెల్‌నెస్ సెంటర్లు మంజూరైనప్పటికీ, వరంగల్ జిల్లాకు పూర్తి అనుమతులు లభించడం గర్వకారణం. ఈ సెంటర్‌ను నా ఎంపీ నిధులతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, అత్యుత్తమ సౌకర్యాలతో తీర్చిదిద్దుతాను” అని స్పష్టం చేశారు.
వరంగల్ పరిధిలోని 54 ప్రధాన పట్టణాల్లో నివసిస్తున్న 15 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ వెల్‌నెస్ సెంటర్ ద్వారా ప్రాథమిక వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ, ఆరోగ్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగుతుంది.
తన విన్నపాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, వెల్‌నెస్ సెంటర్ సేవలు త్వరగా ప్రారంభించేందుకు CGHS డైరెక్టర్ కు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న ఈ దీర్ఘకాలిక సమస్యకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య చొరవతో పరిష్కారం లభించడం పట్ల వారు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ విజయం వరంగల్ ప్రజల ఆరోగ్య సంక్షేమంలో కీలక మలుపుగా నిలుస్తుంది.