హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని ఒక ఫామ్ హౌస్‌లో పూజల పేరుతో ఘోర మోసం వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నమ్మించిన ఇద్దరు పూజారులు బాధితుల నుండి రూ. 55,55,555 దోచుకుని పరారయ్యారు.
హనుమకొండ (HNK) శివారులోని ఒక గ్రామానికి చెందిన తండ్రి మరియు ముగ్గురు అన్నదమ్ములని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పూజారులు బురిడీ కొట్టించారు.
నగదు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తే ఆ డబ్బు మూడింతలు అవుతుందని నిందితులు బాధితులను నమ్మించారు. పూజ సమయంలో నగదు ఉన్న బ్యాగులను అక్కడ పెట్టించి, పూజ ముగిశాక బాధితులను వేరే గదిలోకి పంపించారు. అనంతరం, డబ్బులు స్విమ్మింగ్ పూల్‌లోని బాక్సుల్లో ఉన్నాయని అబద్ధం చెప్పి నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.
ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.