Homeకాజిపేట్అమ్మవారిపేట శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర పై సమీక్ష | ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

అమ్మవారిపేట శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర పై సమీక్ష | ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

అమ్మవారిపేట:

హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారిపేట శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో పాటు అత్యంత భద్రతతో నిర్వహించేందుకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు అధికార యంత్రాంగంతో కలిసి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

తొలుత శ్రీ సమ్మక్క – సారక్క అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు గారు..

అనంతరం జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే నాగరాజు, మేయర్ సుధారాణి గారు ఆవిష్కరించారు.

ఈ సమీక్ష సమావేశంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు..

రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఆర్&బి శాఖ, ఆర్టీసీ శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొని జాతర ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు..

అంబులెన్స్ సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి అన్ని మౌలిక సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులను స్పష్టంగా ఆదేశించారు.

భక్తుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు స్పష్టం చేశారు.

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు.

జాతర నిర్వహణలో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, చిన్న సమస్య కూడా పెద్దదిగా మారకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ముఖ్యంగా రద్దీ నియంత్రణ, మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, అమ్మవారి జాతర జరిగే ప్రదేశంలో కొంత భాగం ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిగా ఉన్నందున, ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఎక్కడైనా అందుబాటులో ఉంటే, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, జాతరకు అవసరమైన అదనపు భూమిని కేటాయించే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

సమీక్ష అనంతరం అమ్మవారిపేట జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు జాతర కమిటీ సభ్యులకు కండువాలు కప్పి, సంప్రదాయాలను గౌరవిస్తూ, క్రమశిక్షణతో, భక్తుల సేవే లక్ష్యంగా పనిచేసి ఈ పవిత్ర జాతరను విజయవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, జాతర కమిటీ సభ్యుల సమిష్టి కృషితోనే ఈ జాతర మరింత వైభవంగా జరుగుతుందని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక కార్పొరేటర్ జలగం అనిత – రంజిత్ రావు, 43వ డివిజన్ కార్పొరేటర్ అరుణ – విక్టర్, జాతర కమిటీ చైర్మన్ శ్రీ పూడూరు బిక్షపతి, కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments