మడికొండ: వర్ధన్నపేట నియోజకవర్గంలో YS రాజశేఖర్ రెడ్డి హయాంలో ఘర్ వాపసీ పథకం కింద మడికొండ శివారులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి, అనేక పద్మశాలి కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. ఈ కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండేలా అన్ని విధాలా ప్రోత్సాహం అందించారు.
కానీ గత 15 సంవత్సరాలుగా ఈ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పవర్ వీవ్‌లకు విద్యుత్ సమస్య – జీవనోపాధి దెబ్బ
పవర్ వీవ్‌లకు నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల పద్మశాలి కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఈ సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి శ్రీ కేఆర్ నాగరాజు, పారిశ్రామిక శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
ప్రభుత్వం ఆదుకోవాలి – ఎమ్మెల్యే విజ్ఞప్తి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, “ఘర్ వాపసీ కింద వచ్చిన పద్మశాలి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్మిక కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.