అసెంబ్లీలో రేవంత్ పలకరింపుపై కేటీఆర్ స్పందన – కేసీఆర్ పట్ల గౌరవాన్ని గుర్తుచేసిన వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పలకరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అదే సంస్కారం బయట మాటల్లో కూడా చూపిస్తే మరింత బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా, పరస్పర గౌరవం ఉండటం మంచిది. తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారు,” అని తెలిపారు.
రంధ్రాన్వేషణ మానుకోవాలని రేవంత్‌కు కేటీఆర్ సూచన
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో రంధ్రాన్వేషణ మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు. “కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంగా ప్రభుత్వం పనులను ఆపడం రాష్ట్రానికే నష్టం,” అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ చిత్తశుద్ధిని గుర్తుచేస్తూ, “గోదావరి నీటి హక్కుల కోసం అదనపు టీఎంసీలు తీసుకొచ్చారు,” అని కేటీఆర్ చెప్పారు.
రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటున్నందుంచే తనపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. “నన్ను తిడితే సరే కానీ, కేసీఆర్‌ను తిట్టితే మాత్రం ఊరుకోలేము,” అని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
పార్టీని వీడి వెళ్ళిన వారిని తిరిగి తీసుకోమన్న కేటీఆర్
బీఆర్ఎస్ నుండి తప్పుకుని ఇతర పార్టీలలో చేరిపోయిన నేతలను తిరిగి ఆహ్వానించాలనే ఉద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
“బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ స్థానాలను గెలిపించారు. ఇది మా కేడర్ బలం,” అన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో మారిన క్షేత్ర స్థాయిలో వాతావరణం
సర్పంచ్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయని కేటీఆర్ పేర్కొన్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు భయపడి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడంలేదు. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం తప్పనిసరిగా మున్సిపల్ ఎన్నికలు చేపట్టే పరిస్థితి వచ్చింది,” అని విమర్శించారు.