కాజీపేట న్యూస్: వరంగల్ ట్రైసిటీలో ఏటీఎం మిషన్‌లలో ఇనుప రేకులు అమర్చి డబ్బులు దోచుకుంటున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్ రాష్ట్ర ముఠాను సిసిఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా ఆరెస్టు చేశారు.
అరెస్టయ్యిన ఏడుగురు నిందితుల వద్ద నుండి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు మొబైల్ ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులు నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా, మాల్కిడా తాలుకాకు చెందినవారని పోలీసులు గుర్తించారు.
నిందితుల వివరాలు
ఆరిఫ్ ఖాన్ (23)
సర్ఫరాజ్ (24)
ఆష్ మహ్మద్ (29)
షాపుస్ ఖాన్ (33)
షారూఖ్ ఖాన్ (33)
అస్లాం ఖాన్ (33)
షారుఖాస్ (27)
చోరీల పద్ధతి
నిందితులు Perto Company సంస్థకు చెందిన ఏటీఎం మిషన్లలో లోపాలను గుర్తించి, నకిలీ తాళాలతో మిషన్ కవాటం తెరిచి, నగదు వచ్చే మార్గంలో ఇనుప ప్లేటును గమ్‌తో అతికించేవారు. దీంతో కస్టమర్ డబ్బు డ్రా చేసినా, నగదు బయటకు రాకుండా యంత్రంలోనే ఇరుక్కుపోయేది.
కస్టమర్ వెళ్లిపోయాక, ముఠా సభ్యులు తమ తాళాలతో యంత్రం తెరిచి నిలిచిపోయిన డబ్బును దొంగిలించేవారు.

పోలీసుల విచారణ
ఈ ముఠా ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ సహా 40 కి పైగా చోరీలకు పాల్పడినట్టు విచారణలో తేలింది.
ఇటీవల వరంగల్ ట్రై సిటీలో 7 ఏటీఎం కేంద్రాల్లో రూ.12.10 లక్షల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు.
ఆపరేషన్ వివరాలు
బ్యాంకులకు వరుసగా ఫిర్యాదులు రావడంతో ఎఫ్.ఎస్స్.ఎస్. లిమిటెడ్ కంపెనీ ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముఠాను ట్రాక్ చేశారు.
చివరకు ఈ రోజు ఉదయం కాజీపేట్ ఏటీఎమ్ వద్ద చోరీకి సిద్ధమవుతున్నారనే సమాచారం ఆధారంగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రశంసలు
ఇందుకు ప్రతిభ కనబరిచిన సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్ పాషా, ఎస్.ఐలు నవీన్‌కుమార్, లవణ్‌కుమార్, శ్రీనివాస్‌రాజు, ఇతర సిబ్బందిని కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.