సామాజిక తెలంగాణ సాధననే జాగృతి ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.
సోమవారం ట్విట్టర్ (ఎక్స్) లో #AskKavitha హ్యాష్‌ట్యాగ్‌పై నెటిజన్లతో ఆమె చేసిన ఇంటరాక్షన్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది.
యువత, మహిళలకు అవకాశాలు
కవిత మాట్లాడుతూ యువత, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు దక్కేలా జాగృతి కృషి చేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో ఎక్కువమంది యువత, మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామన్నారు.
విద్య, వైద్యం – ముఖ్య లక్ష్యాలు
సామాజిక తెలంగాణ సాధించాలంటే నాణ్యమైన, ఉచిత విద్య, వైద్యం అందరికీ సులభంగా లభించాలన్నారు.
తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
‘ఉద్యోగాలు, నైపుణ్యం, భద్రతల్లో ఏమి ప్రాధాన్యం ఇస్తారు?’ అన్న ప్రశ్నకు — యువతకు ఉద్యోగాలు కల్పించడం తన మొదటి ప్రాధాన్యమని చెప్పారు.
జాగృతి త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించనుందని, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు
రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యంతో విద్యార్థులు చదువులు మానాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు.
రైతుల ఆత్మహత్యలు పెరగడం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఫార్మా సిటీ పేరుతో భూములు తీసుకొని “ఫ్యూచర్ సిటీ” అంటూ ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం పై త్వరలో హెచ్ఎంఎస్తో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు
హైదరాబాద్ ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందని తేల్చి చెప్పారు. వెస్ట్ సిటీలో పెట్టిన దృష్టిని ఈస్ట్ సిటీ అభివృద్ధిపై పెట్టకపోవడం విచారకరమన్నారు.
వ్యక్తిగత సమాధానాలు
నెటిజన్లు అడిగిన వ్యక్తిగత ప్రశ్నలకు కూడా కవిత ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. రామ్ చరణ్ గురించి “చాలా హంబుల్ వ్యక్తి, మంచి డ్యాన్సర్,” అని అభివర్ణించారు. అయితే తాను చిరంజీవి అభిమానినని, “చిరంజీవి తర్వాతే రామ్ చరణ్” అన్నారు. రాజకీయాలకు బదులుగా బిజినెస్ చేయాలని ఒకరు సూచించగా, సామాజిక సేవ కొనసాగుతూనే మంచి దిశలో ఆలోచిస్తానని సమాధానమిచ్చారు.
వ్యక్తిగత సమాధానాలు
‘ఆస్క్ కవిత’ కార్యక్రమం గంటన్నర పాటు కొనసాగగా, వందలాది నెటిజన్లు పాల్గొన్నారు. వారి ప్రశ్నలకు కవిత ఇచ్చిన సమాధానాలు ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగంలో నంబర్ వన్ ట్రెండ్‌గా నిలిచాయి.