న్యూఢిల్లీ: రైతుల అభ్యున్నతికి కేంద్రం కీలక చర్యలు చేపట్టాలని పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
రైతులకు కేంద్రం మరింత మద్దతు అందించాలి: ఎంపీ డాక్టర్ కడియం కావ్య
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంబంధిత పథకాల పురోగతి, లబ్ధిదారుల వివరాలు, కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు.
రైతుల సమస్యలను తాను పార్లమెంట్ వేదికగా నిరంతరం ప్రస్తావిస్తానని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ మేరకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం ఇచ్చారు.
కీలక పంటలకు MSP – వరంగల్‌లో భారీ సేకరణ
2025–26 ఖరీఫ్ సీజన్‌కు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలలో సాధారణ వరి ₹2,369, మద్యస్థరకం పత్తి ₹7,710 క్వింటాల్‌కు నిర్ణయించబడినట్లు తెలిపారు. 2024–25లో వరంగల్ జిల్లాలో 2.95 లక్షల బేళ్ల పత్తి, 15.56 లక్షల టన్నుల వరి సేకరణ జరగడం రైతులకు నేరుగా ఆదాయ భద్రత కల్పించిందని పేర్కొన్నారు.
PMKSY కింద నీటిపారుదల పురోగతి
‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకంతో దేశవ్యాప్తంగా 106.75 లక్షల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదల అమలు చేయబడిందని, చిన్న రైతులకు 55% వరకు సబ్సిడీ అందుతోందని తెలిపారు.
AIBP కింద 2016 తర్వాత 70 ప్రాజెక్టులు పూర్తికాగా, 29.22 లక్షల హెక్టార్ల సాగు సామర్థ్యం పెరిగిందని తెలిపారు.
హర్ ఖేత్ కో పాని ద్వారా 22.21 లక్షల హెక్టార్లలో కమాండ్ ఏరియా అభివృద్ధి జరిగిందన్నారు.
PMFBY కింద భారీ బీమా క్లెయిమ్‌లు
2024–25 సంవత్సరంలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ద్వారా ₹12,256 కోట్ల పరిహారం రైతులకు అందించినట్లు, 622 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి బీమా కవరేజిలో ఉండగా 1,514 లక్షల మంది రైతులు లబ్ధిపొందినట్లు మంత్రి ప్రస్తావించారు.
సేంద్రీయ వ్యవసాయానికి PKVY తో మద్దతు
పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY) కింద ఇప్పటివరకు 16.90 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సాగు ప్రోత్సహించబడిందని, 28.24 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని, మూడు సంవత్సరాలకు హెక్టారుకు ₹31,500 సహాయం ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
అయితే వరంగల్ ప్రాంతానికి అనుగుణంగా రైతులకు అందించే పథకాల అమలు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. రైతుల కోసం నా పోరాటం కొనసాగుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.