వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో విద్యుత్ స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
హనుమకొండ పున్నేల్ రోడ్‌లోని స్వర్ణ, ఉజ్వల, మంచుకొండ విద్యుత్ స్తంభాల తయారీ కేంద్రాలను సీఎండీ స్వయంగా సందర్శించి, తయారీ ప్రక్రియను పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా భారీ గాలులు వీచినప్పుడు విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా ఉండాలంటే, తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పాటించాలని అధికారులను, తయారీదారులను ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండాలంటే స్తంభాల పటిష్టత చాలా ముఖ్యమని, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.