న్యూఢిల్లీ ౼పార్లమెంట్
పంచాయతీలకు నిధుల కేటాయింపు, మహిళా సాధికారత పై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రశ్నించారు..
గ్రామీణ అభివృద్ధికి కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చుకావాలి: ఎంపీ డా.కడియం కావ్య
వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు, మహిళా ప్రజాప్రతినిధుల శిక్షణ, డిజిటల్ పాలన, గ్రామీణ మౌలిక సదుపాయాల పురోగతిపై లోక్‌సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ…
15వ ఆర్థిక సంఘం కింద వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు ఎంత మేరకు నిధులు కేటాయించారో, వాటి వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పణ స్థితిగతులపై వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) పథకం కింద మహిళా సర్పంచులు, మహిళా ప్రజాప్రతినిధులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల వివరాలు, శిక్షణ పొందిన మహిళల సంఖ్యను వెల్లడించాలని అడిగారు. అలాగే గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన కోసం e-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ వంటి డిజిటల్ పాలనా సాధనాల అమలు స్థితి ఏమిటి, వరంగల్ జిల్లాలో ఎన్ని పంచాయతీలు ఈ పోర్టల్‌ను వినియోగిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి వరంగల్ జిల్లాలో పూర్తయిన ప్రాజెక్టులు, ప్రగతిలో ఉన్న పనుల వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డా. కడియం కావ్య డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు..
గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు, అధికారాలు అందితేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, నిధుల వినియోగంలో పారదర్శకత, మహిళా నాయకత్వానికి బలమిచ్చే శిక్షణ అత్యంత కీలకమని ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధికి కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చుకావాలని ఎంపీ స్పష్టం చేశారు.
స్పందించిన కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి
దీనికి స్పందించిన కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 6,021.18 కోట్లు అన్‌టైడ్, టైడ్ నిధులుగా విడుదల చేసినట్లు తెలిపారు. 2020-21లో రూ. 1,847 కోట్లు, 2021-22లో రూ. 1,365 కోట్లు, 2022-23లో రూ. 1,415 కోట్లు, 2023-24లో రూ. 1,424.18 కోట్లు విడుదలైనట్లు మంత్రి వివరించారు.
అయితే 2024-25కు సంబంధించి రూ. 1,514 కోట్లు, 2025-26కు రూ. 1,477 కోట్లు నిధులు ఇంకా విడుదల కాలేదని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికైన గ్రామీణ స్థానిక సంస్థలు లేకపోవడం, రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల అమలులో లోపాలు ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. పంచాయతీల స్థాయిల వారీగా నిధుల పంపిణీ రాష్ట్రాల బాధ్యతేనని, కేంద్ర ప్రభుత్వం వద్ద అలాంటి డేటా లేదని మంత్రి స్పష్టం చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల శిక్షణ అంశంపై స్పందిస్తూ, రాష్ట్రియ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) పునరుద్ధరణ తర్వాత 2022-23 నుంచి దేశవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు శిక్షణ అందించినట్లు తెలిపారు. ఇందులో 27.3 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పారు. అలాగే పంచాయత్ నేత్రి అభియాన్ కింద 2025 నవంబర్ 25 నాటికి 44,143 మంది మహిళా నాయకులను నాయకత్వం, పాలన, కమ్యూనికేషన్, నిర్ణయాత్మక నైపుణ్యాల్లో శక్తివంతం చేసినట్లు వివరించారు.
డిజిటల్ పాలనపై సమాధానంగా, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా 2024-25లో 2.55 లక్షల గ్రామ పంచాయతీలు అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేశాయని, పీఎఫ్‌ఎంఎస్ అనుసంధానంతో రూ. 61 వేల కోట్లకు పైగా నిధులు నేరుగా బదిలీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు పారదర్శకత కోసం మెరి పంచాయత్, గ్రామసభల నిర్వహణకు పంచాయత్ నిర్ణయ్, ఆడిట్లకు ఆడిట్ ఆన్‌లైన్ వంటి యాప్‌లు ఉపయోగంలో ఉన్నాయని చెప్పారు. గ్రామీణ రహదారులు, తాగునీటి పనులపై అడిగిన ప్రశ్నకు పంచాయతీలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని, పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని మంత్రి తెలిపారు.
ఎంపీ డా. కడియం కావ్య
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే నిధుల సకాలంలో విడుదల, సమర్థ వినియోగం, మహిళల నాయకత్వానికి మద్దతు, డిజిటల్ పాలనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా వరంగల్ వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకరించాలని కోరారు.