Homeకాజిపేట్చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్: ఐదుగురు శిశువులు రక్షణ

చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్: ఐదుగురు శిశువులు రక్షణ

వరంగల్, జనవరి 10, 2026 — వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్ల వద్ద చిన్నపిల్లలను అపహరించి, వారిని డబ్బుకు అమ్ముతున్న నేరస్థుల ముఠాను కాజిపేట్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.

ఈ ముఠా గతంలో కనీసం ఐదుగురు చిన్నపిల్లలను కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నారు.

అరెస్టైన నిందితులు:

కొడుపాక నరేష్ (42), గ్రామం: ఘవాపూర్ (రాఘవపూర్ ప్రాంతం), పెద్దపల్లి జిల్లా

వెల్పుల యాదగిరి (32), నివాసం: శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఈ రోజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత డిసెంబర్ 28, 2025న తెల్లవారుజామున కాజిపేట్ రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 5 నెలల బాలుడు మల్లన్నను (కన్నా నాయక్ కుమారుడు) అపహరించారు.

ఈ ఘటనపై బాబు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజిపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా కాజిపేట్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందాలు కలిసి విచారణ చేపట్టగా… ఈ రోజు ఉదయం అద్దె కారులో మళ్లీ చిన్నపిల్లల కిడ్నాప్ ప్రయత్నంలో ఉన్న ఈ ఇద్దరు నిందితులను కాజిపేట్ రైల్వే స్టేషన్ బయట అనుమానాస్పదంగా రెక్కీ చేస్తుండగా పట్టుకున్నారు.

విచారణలో నిందితులు డిసెంబర్ 28న కిడ్నాప్ చేసిన 5 నెలల బాబు మల్లన్నతో పాటు గతంలో నలుగురు చిన్నపిల్లలను కూడా అపహరించినట్లు ఒప్పుకున్నారు.

వీరు రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్‌పాత్‌లపై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న శిశువులను గుర్తించి, అపహరించి, పిల్లలు కలగని దంపతులకు భారీ మొత్తంలో డబ్బుకు అమ్మేవారు.

ఇతర కిడ్నాప్ బాధితుల వివరాలు:

  • ఆగస్టు 2025: వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై 10 నెలల బాలిక (మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో అమ్మారు)
  • అక్టోబర్ 2023: కాజిపేట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై 3 సంవత్సరాల బాలుడు (జన్నారం మండలంలో అమ్మారు)
  • అక్టోబర్ 2025: మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద 5 నెలల బాలిక (మంచిర్యాలలోనే అమ్మారు)
  • జూన్ 2025: రామగుండం రైల్వే స్టేషన్ వద్ద 10 నెలల బాలిక (జగిత్యాల జిల్లాలో అమ్మారు)

నిందితుల ఒప్పుకోలు ఆధారంగా పోలీసులు ఐదుగురు బాలలనూ (మల్లన్నతో సహా) వివిధ ప్రాంతాల నుంచి రక్షించారు.

అలాగే చట్టబద్ధమైన దత్తత సంస్థల ద్వారా కాకుండా ఈ పిల్లలను కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసును విజయవంతంగా ఛేదించిన టాస్క్ ఫోర్స్, కాజిపేట్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి, రివార్డులు అందజేశారు.

ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్ అధికారులు, కాజిపేట్ ఏసీపీలు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజిపేట్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేస్‌లలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు

ఈ నేర బృందం వెనుక ఏదైనా పెద్ద నెట్‌వర్క్ ఉందేమోనని మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments