హనుమకొండ, జనవరి 12:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం–పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, గత రెండేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేస్తూ ప్రజల మధ్య ఉంటున్నామని తెలిపారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రతి డివిజన్ నాయకుడు తన పరిధిలోని దేవాలయాలు, మసీదులు, సంఘాలు, కమిటీలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు.
ఈ నెలలో ప్రతి డివిజన్లో ఒక రోజు చొప్పున పర్యటన..
ఎవరు కష్టపడి పనిచేస్తారో, ప్రజల్లో ఉంటారో వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కుల, జనాభా ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.
గత ఎన్నికల్లో ప్రతి బూత్ వారీగా వచ్చిన ఓట్ల వివరాల జాబితాను నాయకులు దగ్గర పెట్టుకోవాలని, స్లం ఏరియాల్లో ఉన్న సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు.
డివిజన్లో అధికారులతో పర్యటించినప్పుడు ఇప్పటికే జరిగిన పనులు, ఇంకా చేయాల్సిన పనులపై స్పష్టంగా వివరించాలని ఆదేశించారు.
డివిజన్ పర్యటనలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆ డివిజన్ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
భోజనం అనంతరం కుల పెద్దల ఇళ్లలో టీ బ్రేక్ ఉంటుందని, ఆ సమయంలో గ్రూప్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు.
డివిజన్ స్థాయితోనే కాకుండా బూత్ స్థాయిలో ఎందుకు ఓటింగ్ తగ్గుతుందో విశ్లేషణ చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో 7 ఎకరాల భూమిని గుర్తించామని, దానిపై సుమారు 3,500 ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉందని తెలిపారు.
అండర్ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటర్నల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక పనులు చేశామని, ఈ అభివృద్ధిని ప్రజల్లో ధైర్యంగా చెప్పాలని కార్యకర్తలకు సూచించారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వం, ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులనే ప్రచారం చేయాలని, వ్యక్తిగత విమర్శలు, అనవసర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
ఎవరో చెప్పారని కార్పొరేటర్ టికెట్ అడగకూడదని, ముందుచూపుతో డివిజన్ అధ్యక్షులను బలోపేతం చేయాలని తెలిపారు.

నియోజకవర్గ సమస్యలను స్పష్టంగా తెలియజేస్తే ముఖ్యమంత్రి వద్ద నిధులు కోరేందుకు అవకాశం ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో డివిజన్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, RTA సభ్యులు పల్లకొండ సతీష్, జిల్లా అనుంబంధ సంఘాల చైర్మన్లు బంక సరళ, విక్రమ్, రాజ్ కుమార్, శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.