ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. జాతర నిర్వహణలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి. ఆదేశించారు. బుధవారం మేడారంలో జోనల్ మరియు సెక్టార్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంతాన్ని శాస్త్రీయంగా విభజించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
మొత్తం జాతర ప్రాంతాన్ని 12 జోన్లుగా విభజించి జోన్ల పర్యవేక్షణ కోసం 62 మంది జోనల్ అధికారులను నియమించారు. మొత్తం 51 సెక్టార్లను ఏర్పాటు చేసి, వాటి బాధ్యతలను 179 మంది అధికారులకు అప్పగించారు.
ప్రతి అధికారి తమకు కేటాయించిన ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు భక్తుల క్యూ లైన్ల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ, జాతర విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.