స్టేషన్ ఘనపూర్, జనవరి 8, 2026:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలను అందించడమే తన ప్రధాన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.
జఫర్ గడ్ మండలం సాగరం గ్రామ సమీపంలో దేవాదుల ప్రాజెక్టు ఫెజ్–3, ప్యాకేజీ–6 పనులను ఆయన ఈరోజు నీటి పారుదల, రెవెన్యూ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో కాలువల నిర్మాణ పనులను పరిశీలిస్తూ, అధికారుల నుండి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంలో రైతులతో కూడా చర్చించి, వారి సమస్యలను అర్థం చేసుకున్నారు.
శ్రీహరి గారు మాట్లాడుతూ, “నా ఏకైక ప్రాధాన్యత ప్రతి గ్రామానికి గోదావరి జలాలు తీసుకురావడం; ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరు అందించడమే నా లక్ష్యం” అని పేర్కొన్నారు.
2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు రూపుదిద్దుకున్నదని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందిన ఈ ప్రాజెక్టు మొదట అంచనా కంటే ఇప్పుడు రూ. 18,400 కోట్లకు పెరిగిందని తెలిపారు.

ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న జనగామ, నేడు దేవాదుల జలాలతో రాష్ట్రంలోనే అత్యధిక వరిధాన్యం పండిస్తున్న ప్రాంతంగా ఎదిగిందని చెప్పారు.
ప్యాకేజీ–6 పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని శ్రీహరి గారు తెలిపారు.
రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే పనులు సమయానికి పూర్తవుతాయని ఆయన భావించారు.
జఫర్ గడ్ మండలం పరిధిలోని దంసా కాలువ, బంజరు మాటు, బొల్ల మత్తడి వంటి చోట్ల మారమ్మత్తు పనులు చేపట్టాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు.
నష్కల్ నుండి పాలకుర్తి ప్రధాన కాలువ ద్వారా దంసా చెరువు, జఫర్ గడ్ చెరువులను నింపి సంవత్సరమంతా నీటిని నిల్వచేయాలనే ప్రణాళిక వివరించారు.
రైతుల భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జఫర్ గడ్ మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, ఈఈ మంగీలాల్, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.