తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ క్షేత్రం సరికొత్త హంగులతో సిద్ధమైంది. మేడారంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పునరుద్ధరణ మరియు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు మేడారంలో పర్యటించి, ఈ పనులను అధికారికంగా ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన వనదేవతల సన్నిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారానికి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.