చారిత్రక వరంగల్ కోట (ఓరుగల్లు కోట) పరిరక్షణ కోసం కేంద్ర బొగ్గు & గనుల మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కోట భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలను వెంటనే తొలగించాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


కాకతీయుల కాలంలో నిర్మించిన వరంగల్ కోట దాదాపు 250 సంవత్సరాల పాటు వారి రాజధానిగా విరాజిల్లింది. శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు 7 ప్రాకారాలు (గోడలు) నిర్మించారు. కానీ ప్రస్తుతం కేవలం 3 మాత్రమే మిగిలాయి. మిగతా భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి.

భారత పురావస్తు శాఖ (ASI) అధికారులు 2022 నవంబర్ 4, 2025 డిసెంబర్ 1 తేదీల్లో వరంగల్ జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్లో కోట భూములు “ప్రభుత్వ భూమి”గా నమోదు కావడం వల్ల ASIకి అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కోటలో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేసి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని, కానీ ఆక్రమణలు కొనసాగితే చారిత్రక వారసత్వం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ASIకి పూర్తి సహకారం అందించి, భూములను ASI ఆస్తిగా గుర్తించి రికార్డులు సవరించాలని కోరారు.
ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. చారిత్రక స్మారకాల పరిరక్షణపై ఈ చర్చ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.