హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా హౌసింగ్ ఎండీ మరియు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు అభ్యర్థించారు.
హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లలో జనగామ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జనగామ జిల్లాలోనూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు.
“స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంజూరు చేసిన 3,500 ఇళ్లలో 3,400 ఇళ్లు గ్రౌండింగ్ పూర్తయ్యాయి” అని ఆయన వెల్లడించారు.
ఈ పథకం అమలులో కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి గారిని కోరారు.
ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పొందినవారు బేస్ మెంట్ స్థాయికి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ బిల్లులు ఆపివేశారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని సూచించారు.
అలాగే నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల స్థానంలో కొత్త వారికి ఇళ్లు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అభ్యర్థించారు.
అనంతరం ధర్మసాగర్ మండలం దేవునూరు గుట్ట ప్రాంతంలో పట్టా రైతులు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆయన ప్రస్తావించారు.
ఫారెస్ట్ మరియు రెవెన్యూ శాఖలు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించి రిపోర్టు సమర్పించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
న్యాయపరంగా హక్కు ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి గారిని కోరారు.
అలాగే దేవునూరు గుట్ట మరియు ధర్మసాగర్ రిజర్వాయర్లను కలిపి ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు వాటిని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) పరిధిలోకి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.