GWMC: స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు (SHGలకి) అక్షరజ్ఞానం అత్యంత అవసరమని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అన్నారు.
వయోజన విద్యా శాఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం లో భాగంగా, ఉల్లాస్ (ULLAS – Understanding of Lifelong Learning for All in Society) పథకం కింద ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బల్దియా ప్రధాన కార్యాలయంలోని మెప్మా సమావేశభవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మెప్మా సి.ఆర్.పి లకు అక్షరాస్యత అమలుపై శిక్షణ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో మొత్తం 13 పట్టణ సమాఖ్యలు ఉన్నాయని, ప్రతి సమాఖ్య నుండి ముగ్గురు ప్రతినిధులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
వారు తమ సమాఖ్యకు చెందిన స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి, ప్రాథమిక విద్య అందించేందుకు కృషి చేయనున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘అమ్మకు అక్షరమాల’ పుస్తకాన్ని మేయర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ, జోనా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్ రమేష్ రెడ్డి, డీఎంసీ రజిత రాణి, టీఎంసీ వెంకట్ రెడ్డి, సీఓలు తదితరులు పాల్గొన్నారు.