తెలంగాణలో కొత్త వాహనాలపై ‘రహదారి భద్రతా సెస్సు’ అమలు చేస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త బైక్‌లపై ₹2,000, కార్లపై ₹5,000, భారీ వాహనాలపై ₹10,000 చొప్పున సెస్సు వసూలు చేస్తారు. ఆటోలు, ట్రాక్టర్లు, వ్యవసాయ వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. సరుకు రవాణా వాహనాలకు త్రైమాసిక పన్ను రద్దు చేసి, 7.5% లైఫ్ ట్యాక్స్ విధిస్తున్నారు.
పాత వాహనాలపై వయసు ఆధారంగా 4-6.5% పన్ను, కఠిన లైసెన్సింగ్, కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ టెస్టులతో రోడ్డు భద్రత మెరుగుపరుస్తారు. ఏటా 9 లక్షల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లతో ప్రభుత్వానికి ₹300 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.