వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ మోటార్‌ను సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు.
వివరాలోకి వెళ్తే..
చెన్నారావుపేట మండలం, లింగాపురం గ్రామానికి చెందిన పల్నాటి సబిత (35) తాను నిర్మించుకుంటున్న ‘ఇందిరమ్మ’ ఇంటికి నీళ్లు పడుతుండగా, అకస్మాత్తుగా విద్యుత్ మోటార్ ఆగిపోయింది.
మోటార్ ఎందుకు ఆగిందో చూద్దామని దానిని సరిచేసేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రమైన విద్యుదాఘాతం కారణంగా ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మృతురాలి భర్త లింగమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై రాజేష్ రెడ్డి స్పందిస్తూ, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.