న్యూఢిల్లీ: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య శుక్రవారం న్యూ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి, కాకతీయ యూనివర్సిటీలో అమలవుతున్న RUSA 2.0 పరిశోధన & ఇన్నోవేషన్ ప్రాజెక్టుల గడువును ఒక ఏడాది పొడిగించాలని వినతి పత్రం సమర్పించారు.
కాకతీయ యూనివర్సిటీకి RUSA 2.0 కింద మొత్తం 50 కోట్ల రూపాయలు మంజూరు కాగా, అందులో 35 కోట్లు పరిశోధన ప్రాజెక్టులకు, 15 కోట్లు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఉద్యోగ అవకాశాల పెంపు మరియు ఇన్నోవేషన్ హబ్ (K-HUB) నిర్మాణానికి కేటాయించినట్టు ఎంపీ మంత్రికి వివరించారు.
పరిపాలనా అనుమతులు 2024 జూన్‌లోనే లభించడంతో ప్రస్తుతం:
5 రీసెర్చ్ సెంటర్లు
37 వ్యక్తిగత పరిశోధన ప్రాజెక్టులు
75 మంది రీసెర్చ్ ఫెలోస్ నియమితులు
క్రియాశీలంగా కొనసాగుతున్నాయి. అలాగే 9.4 కోట్లతో సివిల్ పనులు, ఐసీటీ సదుపాయాలు, ల్యాబ్ పరికరాల కొనుగోళ్లు జరుగుతున్నాయి.
అయితే ప్రస్తుత గడువు మార్చి 31, 2026 మాత్రమే ఉండటంతో ఈ విస్తృత పరిశోధనలు, మౌలిక సదుపాయాల పనులు పూర్తి కావడం కష్టమని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. గడువును మార్చి 31, 2027 వరకు పొడిగించాలని కోరారు.
“గడువు పెంచకపోతే 75 మంది రీసెర్చ్ స్కాలర్స్, 42 ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. నిధుల సమర్థ వినియోగం ఆగిపోతుంది. వరంగల్‌ను పరిశోధనలు – నూతన ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం” అని డా. కడియం కావ్య పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు.